Saturday, February 28, 2009

కేశవరెడ్డి మునెమ్మ

మొదటి టపా నాకు నచ్చిన ఒక మంచి నవలతో మొదలెట్టాలనుకున్నాను కానీ ....

మునెమ్మ నవల గురించి సమీక్షలూ, విమర్శలూ, చర్చా చదివాక ఆసక్తితో ఆ నవల తెప్పించుకు చదివాను.
కాత్యాయని గారు రాసినట్లు “రాసే వాళ్ళకి చదివేవాళ్ళు లోకువ” అని మొదటి పేజీలు కొన్ని చదవగానే అనిపించింది.
రచయిత పాఠకుల్ని ఎంత ఫూల్స్ గా భావించాడా అనుకుంటే బాధ కలిగింది.
అందుకే ఈ టపా..
****

మునెమ్మ నవల అంతా లెక్కలేనన్ని వైరుధ్యాలు.
బరువు బాధ్యతలు తెలీకుండా తండ్రి అవలక్షణాలన్నీ అంది పుచ్చుకుని తండ్రి మిగిల్చిన 8 గుంటల నేలని కూడా పోగొట్టుకున్న జైరాముడంటే ఎవరికీ విలువలేదని ఓప్రక్క చెపుతారు.
మరోప్రక్క ఆ జైరాముడు, మునెమ్మా వెళ్తుంటే ఊరంతా వాళ్ళని సీతారాములంటారని చెపుతారు.

“మద్దిపాళెం వంటి చోట్ల పరస ప్రారంభం కాగానే తరుగులోడు అక్కడ వాల్తాడు. పరస జరిగినన్నాళ్ళు అక్కడే మకాం వేస్తాడు” అని వాడిని పరిచయం చేస్తారు.
కానీ ఆ పరిచయంలోనే ఆ వాక్యం అబద్ధమని మనకి తెలుస్తూ ఉంటుంది. తరుగులోడు జైరాముడు అడిగితే పరసకి వెళ్ళి పరస జరుగుతూ వుండగానే మళ్ళీ వెనక్కి వస్తాడు. హత్య చేశాడు కాబట్టి కాదు, వాడిపద్ధతే అదన్నట్లుగా వుంటుంది. నవల్లో.

****

"పిలగా" అనేది మునెమ్మ భావావేశంలో జైరాముడ్ని పిలిచే పిలుపని చినబ్బకెలా తెలిసిందో ఎవరు చెప్పారో మనకి తెలీదు. (రచయిత మనకి చెప్పలేదు). జైరాముడు చచ్చిపోయాడు కాబట్టి మునెమ్మే చెప్పుండాలి. తాను భావావేశంలో భర్తని ఏమని పిలుస్తుందో భర్త చనిపోయాక మునెమ్మ చినబ్బకెందుకు చెప్పిందో చినబ్బకే తెలియాలి.

అసలు ఆ రాత్రి చినబ్బ అత్తాకోడళ్ళకి కొత్తగా తోడు పడుకోవాల్సిన అవసరమేమొచ్చిందో అర్ధం కాదు. అంతకు ముందు రెండ్రోజులనుంచీ ఆ ఆడవాళ్ళిద్దరూ వంటరిగా పడుకుంటున్నారు.
ఆరోజు కొత్తగా ఆ యింట్లో ఆ ఆడవాళ్ళకొచ్చిన ప్రమాదమేమీ లేదు. ఓదార్పు కోసమయితే.. చినబ్బకి సాయమ్మనీ మునమ్మనీ ఓదార్చగల స్థాయి లేదు.
మునెమ్మకి ఓ కల వస్తుంది.. ఆ కలవచ్చిన సంఘటన చినబ్బ చూడాలి .. కాబట్టి ఆరోజు చినబ్బ తోడు పడుకున్నాడు అని అనుకోవడానికి కేశవరెడ్డిగారు ఇపుడే కథలు రాయడం మొదలుపెట్టిన చిన్నా చితకా రచయిత కాదు గదా!
***

ఇకపోతే మునెమ్మ ఒంటరిగా జైరాముడి హంతకులని వెతకడానికి వెళ్ళడం హాస్యాస్పదంగానే తప్ప ఉద్వేగంగా ఏమీ లేదు.
సాహసం వుద్వేగాన్నిస్తుంది. అవసరం లేని దుస్సాహసం చిరాకు తెప్పిస్తుంది. ఒక్కోసారి దుస్సాహసం కూడా ఉద్వేగాన్ని తెప్పించచ్చు. ఉదాహరణకి విజయశాంతి సినిమాలు మొదట్లో అలాంటి ఉద్వేగాన్ని కలిగించేవి. కానీ తర్వాత బోరు కొట్టాయి. అంతకంటే తెలివిమాలిన మునెమ్మ ముందుమాట రాసిన జయప్రభ గారికి సూక్ష్మగ్రాహిగా కనిపించడం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.
రోజులు గడిచేకొద్దీ సాక్ష్యాలు మాయమవుతాయనీ, పోలీస్ కంప్లయింట్ ఇవ్వమనీ పెద్దలు చెప్పిన సలహాని పెడచెవిని పెట్టి, మేమెళ్ళి కనుక్కుని వస్తామన్న (చినబ్బ తండ్రి ఆ మాట అంటాడు) పెద్దవాళ్ళ మాటని గాలికొదిలేసి ఓ లొట్టిగాడిని వెంటేసుకుని బయల్దేరడం సూక్ష్మగ్రాహి లక్షణమా!
పైగా మునెమ్మవి ఈనాటి స్త్రీల ఆలోచనలూ, వాళ్ళు వేసే అడుగులూనట.(జయప్రభగారు చెప్పిన మాట).
గిత్తలతో రంకు కట్టి చెంప పగలగొట్టే మొగుడ్ని చంపిన హంతకుల్ని తమ చేతులతో తామే చంపేందుకు బయల్దేరతారా ఈనాటి ఆడవాళ్ళు! హతవిధీ !

అనుభవజ్ఞురాలు సాయమ్మ మునెమ్మ ఓంటరిగా వెళ్ళడం గురించి సందేహ పడితే, మునెమ్మ "భూమ్మీదకి వచ్చేముందు మనం ఎలా బ్రతుకుతామో ఆలోచించే వచ్చామా!" అంటుంది.
ఇలాంటి వాక్యాలు చదివినపుడల్లా (చాలా దొరుకుతాయి మనకీ నవల్లో) రాసేవాళ్ళకి చదివేవాళ్ళు లోకువ అని మళ్ళీ మళ్ళీ అనిపించింది.

***

భర్తని చంపిన హంతకుల్ని వెతుక్కుంటూ బయల్దేరిన మునెమ్మ మద్దిపాళెం (భర్త చనిపోయిన వూరు) చేరగానే… "ఊరు కనబడగానే నా వళ్ళంతా పులకరించిపోయిందిరా!.. " అంటూ ఓ పేరా డైలాగులు చెప్తుంది. మూర్ఖుడైన భర్తల్ని ప్రేమించే భార్యలు లేరని కాదు. కానీ ఈ వాక్యాలు మాత్రం అసలేమాత్రమూ మింగుడుపడవు.
"ఆయన నాకు కలలో సూటిగా సందేశమిచ్చాడు" అంటుంది మునెమ్మ భర్తని గురించి.
ఆపాత్రకి సరిపడని భావం. భాష.

***


ఇక ఎక్కువగా చర్చించబడిన బొల్లిగిత్త విషయం.
అది మునెమ్మమీదికి వంగడం సహజమో కాదో నాకు తెలీదు. పశువుల గురించీ, పల్లెల గురించీ నాకెక్కువ తెలీదు.
సహజం కాదని వచ్చిన విమర్శలూ, దానికి రచయిత కేశవరెడ్డిగారి సమాధానమూ చదివాక నేను నవల చదివాను.
అయితే నవలలోని వైరుధ్యాలలోనే నాకు సమాధానం దొరికిందనిపించింది.
బొల్లిగిత్త చేసింది సహజచర్య అయితే సూక్ష్మగ్రాహి మునెమ్మకి ఆ విషయం తెలీకపోవడమేమిటి? (బొల్లిగిత్త మీదపడి రవిక చింపినా, జైరాముడికి కోపమొచ్చి తన చెంప పగలగొట్టి, గొడ్డుని చావగొట్టినా ..ఇదంతా మళ్ళి అత్తకి తాను వివరించి చెప్తూన్నపుడు కూడా మునెమ్మకి విషయం అర్ధం కాదు. ఆతర్వాత కూడా (నవలంతా అయిపోయేవరకూ కూడా) మునెమ్మకి అర్ధమయినట్లు కనిపించదు.) ఇది గిత్తలు సహజంగా చేసే పని అయితే పల్లెపడుచు మునెమ్మకి ఊహకి కూడా తట్టలేదెందుకు!
మునెమ్మదాకా ఎందుకు! ఎంత మూర్ఖుడైన జైరాముడయినా గిత్తల సహజప్రవర్తనకి గిత్తని అమ్మేద్దామనుకుంటాడా! అది సహజప్రవర్తన అయితే కొత్త ఎద్దూ అదే పని చేస్తుంది కదా! ముద్దలు కలుపుకుని సుతారంగా తినకుండా పళ్ళెం నాకుతోందని తనకిష్టమయిన కుక్కని చావగొట్టి అమ్మేస్తాడా జైరాముడు!

_____________

4 comments:

  1. Wordpress నుంచి Blogspot కు మారారా? Template మార్చలేదు. అవే Brown కాగితాలు. ఇదే కొనసాగిస్తారా? బ్లాగ్స్పాట్ కు స్వాగతం.

    ReplyDelete
  2. కథా ప్రక్రియల్లో magic realism అనేది ఒక విధానం. మునెమ్మ ఆ విధానంలో రాసిన నవల. ఇందులో తర్కం కన్నా ఉద్దేశం,రసస్పందనా ముఖ్యం.దయచేసి Kafka 'metamorphosis' చదవండి. అంతమాత్రానా, తర్కం కొలమానంగా విశ్లేషించకూడదని భావన కాదు.కాకపోతే మీ తర్కానికి కాత్యాయని భావజాలకోణం యొక్క అపోహ వాసనలు అంటుకున్నాయనే విషయం మీ భాష్యంలో తేటతెల్లమవుతోంది.

    ఈ చర్చ రచయిత కథను నడిపించిన landscape మహత్యం తెలిస్తేగానీ ఒక గాడిన పడదు. మునెమ్మ నవలలోని కథాప్రదేశానికి (రాయలసీమ- చిత్తూరు) స్థానికుడిగా, నా అనుభవానికీ ఇతర ప్రాంతాల వారి పఠనానుభవానికీ పిసరంత తేడా ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం.ఆ కోణంలో నాకు మీరు అనుకుంటున్న అన్ని వైరుధ్యాలకూ నా దగ్గర సమాధానాలున్నాయని నాకు అనిపిస్తోంది.

    కొంత విశదంగా త్వరలో ఒక వ్యాఖ్య రాస్తాను.

    ReplyDelete
  3. CB రావుగారూ! Wordpress లో ఇదే పేరుతో మరోబ్లాగ్ వుందా! నాకు తెలీదు, నేను ఇపుడే మొదలెట్టానీబ్లాగు.
    మహేష్ గారూ! మీరు విశదంగా రాసే వ్యాఖ్యకోసం ఎదురుచూస్తాను. ఆ వైరుధ్యాలకి కారణం తెలుసుకోవాలనుంది.

    ReplyDelete
  4. మీ విశ్లేషణ చాలా బాగా రాశారండీ. ఇంతా చేసి నేను అసలు నవలిక చదవలేదు. త్వరలో కుదురుతుందేమో!
    తెలుగుబ్లాగరులలో తెలుగు సాహిత్యాన్ని ఇష్టంగా చదివి ఆ పుస్తకాలగురించి బ్లాగే సౌమ్య ఇంకొకరున్నారు. కాకపోతే ఆమె తన పేరుని SOWMYA అని రాస్తారు.
    అనీవే, బ్లాగ్లోకానికి స్వాగతం. మీ నించి మరిన్ని మంచి టపాలకై చూస్తుంటాం.

    ReplyDelete