Thursday, July 2, 2009

వన్ నైట్ @ ద కాల్ సెంటర్

చేతన్ భగత్ ఇంగ్లీష్ లో రాసిన ఈ పుస్తకానికి శాంతసుందరి గారి తెలుగు అనువాదం చదివాను.
అనువాదం బాగుంది. సందేహం లేదు. కానీ పుస్తకం మాత్రం నాకేం నచ్చలేదు.
ఎంత "అసహజంగా" వుంటే ఆ రచనకి అంత "సహజం" అని పేరు రావడం నాకెపుడూ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఇలాంటి పుస్తకాల్లో, సినిమాల్లో సాధారణంగా జరుగుతున్నదే ఈ పుస్తకంలోనూ జరిగింది. కొన్ని సహజ సంఘటనల నేపథ్యంలో పూర్తి అసహజమయిన, అసంబద్ధమయిన విషయాల్ని కథగా మలచడం.
అది రచయిత ఉద్దేశ్యపూర్వకంగా చేసుండకపోవచ్చు. కానీ జరిగినదదే.
రచయిత అబ్జర్వ్ చేసిన విషయాలు (ప్రత్యక్షంగానో, పరోక్షంగానో) కరెక్ట్ అయివుండవచ్చు.
కానీ వాటిని అర్ధం చేసుకున్న విధానం, విశ్లేషించిన విధానం,కరెక్ట్ కాదు. అందుకే అబ్జర్వేషన్స్ ని యధాతధంగా రాసిన చోట బాగున్నాయనిపించాయి. ఉదాహరణకి బక్షీ మీటింగ్ లో ఒక్కక్కరూ ఒక్కోపని చేసుకుంటూ కూర్చోవడం. (ఒకళ్ళు బొమ్మలేసుకుంటూ , ఒకళ్ళు అంకెలు వేసుకుంటూ..)

కానీ ఒక కారక్టర్ ని అర్ధం చేసుకునే శక్తి కానీ, మలిచే నేర్పు కానీ రచయితకి లేవు.
ప్రియాంక పాత్రే అందుకు ఉదాహరణ.
ఒక అమ్మాయి చాలా ఆదర్శవంతంగా వుండచ్చు, అమాయకంగా వుండచ్చు, తెలివిగా, ధైర్యంగా వుండచ్చు.. తెగింపుతోనో, నిస్పృహతోనో వుండచ్చు.. అన్నీ కలగలిసిన కాంప్లెక్స్ ప్రవర్తనా వుండచ్చు. కానీ అలాంటి కాంప్లెక్స్ ప్రవర్తనకి కూడా ఒక పాటర్న్ వుంటుంది.
అయితే ఎలా బడితే అలా రాసేసి అది పాత్రలోని కాంప్లెక్సిటీని చిత్రీకరించడంగా అభివర్ణిస్తేనే నవ్వొస్తుంది.

ఈ నవల ఎంత అసహజంగా నడిచిందంటే "దేవుడు ఫోన్ చేసి మాట్లాడటమనే విషయం" నవలలోని మిగతా చాలా విషయాల కన్నా సహజంగా అనిపించింది.

Wednesday, June 3, 2009

The Art of Happiness – HH DALAI LAMA & HOWARD C CUTLER

The Art of Happiness అనే పుస్తకం చాలా ఉత్కంఠతో తెరిచాను.
మొదటి పేజీలో Dedicated to the Reader. May you find happiness అన్న వాక్యాలు నా ఆసక్తిని మరింత పెంచాయి.
అయితే చదవడం మొదలు పెట్టాక కొత్తగా తెలుసుకున్నదేమీ లేదనిపించింది.
ఈ పుస్తకాన్ని దలైలామా తో తన చర్చల రూపంలో రాశాడు రచయిత. మధ్య మధ్య తన వివరణలు, అభిప్రాయాలు కూడా యిస్తూ.

అయితే యిది చదువుతున్నపుడు ఒకటి మాత్రం అనిపించింది. "వెస్టర్న్ పాఠకులకి ఇంత చిన్న విషయాలు కూడా ఇంత వివరంగా చెప్పాలా" అని.

ఊదాహరణకి మొదటి చాప్టర్ లో హాపీ గా వున్న వాళ్ళు (వుండాలనుకునేవాళ్ళు) ఎక్కువ స్వార్ధంతో వుంటారని అనుకోనక్కరలేదని, అసంతృప్తితో వుండేవాళ్ళలోనే స్వార్ధం ఎక్కువగా వుంటుందనీ వివరించడానికి దాదాపుగా రెండు పేజీల వివరణ యిచ్చాడు రచయిత.
ఇంత చిన్న విషయానికి యింత వివరణా! అనిపించింది.
రెండో చాప్టర్ లో ఆనందంగా వుండడానికి మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళతో పోల్చుకోవడం మంచిదనే సిద్ధాంతం చెప్పబడింది.
ఈ సిద్ధాంతం తెలిసిందే. అయితే ఎంత చిన్న సిద్ధాంతమయినా ఆచరణలో అనేక సందేహాలు, సమస్యలూ వస్తాయి. (మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళతో పోల్చుకుంటే ఎదుగుదల వుండదు కదా! లాంటివి).
ఇలాంటి పుస్తకం చదువుతున్నపుడు … కేవలం సిద్ధాంతాన్ని కాక, ఆ సిద్ధాంతాన్ని ఆచరించడంలో మనుషులు ఎదుర్కునే కంఫ్యూజన్స్ నీ, సమస్యలనీ చర్చించి వాటికి సమాధానాలు చెప్తే బాగుంటుందని ఆశించాను నేను. కానీ ఈ పుస్తకంలో సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే చాలా పేజీలు తీసుకుంది. ఇక అన్నికోణాలనుంచీ దానిని విశ్లేషించడం లేదు.

అలాగే సంతోషంగా వుండడానికి అవతలివారిపట్ల గౌరవం చూపాలనీ, కరుణ పెంపొదించుకోవాలనీ చెప్పబడింది.
కానీ చాలా సందర్భాలలో మనుషులు ఆనందానికి దూరమవడానికి కారణం అవతలివారినుండి గౌరవాన్నీ, కరుణనీ పొందకపోవడం. గౌరవమూ, ప్రేమా, కరుణా లభించనపుడు కూడా ఆనందంగా ఎలా వుండాలి, ఆ బాధని ఎలా ఎదుర్కోవాలి అనేవి పెద్ద సమస్యలు. అవి ఈ పుస్తకంలో చర్చించబడలేదు.
అలాగే చాలా విషయాలు రెండు ఎక్స్ట్రీంస్ మాత్రం వివరించి వూరుకున్నారు.
ఉదాహరణకి ప్రేమ. ఆకర్షణ. పైపై విషయాలు చూసి కలిగేది ఆకర్షణ. దానికి దూరంగా వుండాలి. గుణగణాలు చూసి కలిగేది ప్రేమ. అది పెంపొందించుకోవాలి. అని చెప్పారు. బాగుంది. కానీ జీవితం అంత సింపుల్ కాదే. నిజమైన ప్రేమ, ఒట్టి ఆకర్షణ మాత్రమే వుంటే అసలు సమస్యే లేదు.
ప్రేమలోని రకరకాల కోణాలు, స్థాయిలు వీటీల్తో సమస్యలు వస్తాయి. వాటి గురించి అసలు వివరణే లేదు.
మొత్తానికి అవసరమయిన చాలా ప్రశ్నలు ఈ పుస్తకంలో రాలేదు. వచ్చిన వాటికి కూడా సూటిగా, స్పష్టంగా సమాధానాలు రాలేదు.
అందుకే చాలా సాధారణంగా అనిపించిందీ పుస్తకం నాకు.

Monday, May 18, 2009

తాత్విక కథలు - మంచి కథల సంకలనం

ఈ వారం చదివిన ఒక మచి కథల సంకలనం "తాత్విక కథలు"
మధురాంత్రకం నరేంద్ర సంకలనం చేసిన ఈ పుస్తకంలో 29 కథలున్నాయి.
చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, గోపీచంద్, ఆలూరి బైరాగి, పాలగుమ్మి పద్మరాజు, రాచకొండ విశ్వనాథశాస్త్రి, కాళీపట్నం రామారావు, మధురాంతకం రాజారాం, హితశ్రీ, వాకాటి పాండురంగరావు, ముళ్ళపూడి వెంకటరమణ, ఆర్. ఎస్. సుదర్శనం, సత్యం శంకరమచి, అల్లం శేషగిరి రావు, ఆర్. వసుంధరా దేవి, త్రిపుర, ఏ వి రెడ్డిశాస్త్రి, శ్రీసుభా, పాపినేని శివశంకర్, జలంధర, స్వామి, మహేంద్ర, కె.ఎస్.రమణ, రమణజీవి, డా.వి.ఆర్.రాసాని, ఎమ్మెస్. సూర్యనారాయణ, టి.శ్రీవల్లీరాధిక, మధురాంత్రకం నరేంద్ర - ఇందులోని కథకులు.
నాలుగోవంతుకి పైగా కథలు అద్భుతంగా అనిపించాయి.
రెండు వంతులకి పైగా కథలు విపరీతంగా ఆలోచింపచేసాయి
ఒక వంతుకన్నా తక్కువ కథలు కాస్త సాధారణంగా అనిపించాయి కానీ, వాటిల్లో కూడా నాకు తెలియని లోతులున్నాయేమో.. మరోసారి చదివినపుడు మరోరకమైన భావన కలుగుతుందేమో చెప్పలేను. ఎందుకంటే ఆర్. వసుంధరాదేవిగారి "పెంజీకటికవ్వల" ఇదివరకు చదివిన కథే. అపుడు అంత బాగుందనుకున్న గుర్తు లేదు. కానీ ఇప్పుడు చదివితే చాలా గొప్పగా అనిపించింది.
సృష్టిలో, జీవన్ముక్తుడు, కానుక, మధురమీనాక్షి, పెంజీకటికవ్వల నాకు బాగా నచ్చిన కథలు.ఈ సంకలనంలోని కథలని విశ్లేషించడం నా శక్తికి మిచిన పని. అందుకే నా అభిప్రాయాన్ని మాత్రం రాసుకుని వూరుకుంటున్నాను.

Monday, May 11, 2009

కొత్తనీరు - విహారి

వారాంతం లో చదివిన ఈ పుస్తకం సంతృప్తినే యిచ్చింది.
మంచి ముఖచిత్రంతో వున్న ఈ అందమయిన పుస్తకంలో 15 కథలున్నాయి.
అన్ని కథలూ నచ్చాయని చెప్పలేను కానీ అయిదు కథల వరకూ బాగున్నాయనిపించాయి. (శేషప్రశ్నలు, గూడు-నీడ, భూమధ్యరేఖ, భ్రష్టయోగి, రెండర్ధాల పాట)
ఈ పుస్తకంలో నాకు ముఖ్యంగా నచ్చిన విషయం - పాత్రల ఉద్వేగాలు, ఉక్రోషాలు పాత్రలకే పరిమితమవడం. అవి రచయితవిగా మనకి అనిపించకపోవడం.
అన్నికోణాలనుంచీ ఆలోచించీ, అర్ధం చేసుకుని రాశారనిపించింది.
ఇంకొక విషయం నాకు నచ్చినది ఏమిటంటే ప్రతి వాక్యం పట్లా రచయిత కనపరచిన శ్రద్ధ.
కొన్నివాక్యాలు కవితల్లా అనిపించాయి.

Monday, May 4, 2009

ఖండిత

వి. ప్రతిమ రాసిన ఖండిత చదివానీవారం.
15 కథలున్న పుస్తకం. మొదటి రెండు కథలు (నాగలోకం, దృశ్యాదృశ్యం) కాస్త పరవాలేదు.
మిగతా కథలు అసలు బాగాలేవు.
ఎన్నో విషయాలు ఒకే కథలో ఇమిడ్చే ప్రయత్నం, అసలేం చెప్పదల్చుకున్నారో అర్ధం కాకుండా పోవడం.. చాలా కథల్లో ఇదే ధోరణి.
టైటిల్ స్టోరీ ఖండిత తీసుకుంటే.. ఒక నడివయసు స్త్రీ వంటరి తనం, అర్ధం చేసునే భర్త లేకపోవడం, మనసుకు దగ్గరగా ఓ స్నేహితుడో స్నేహితురాలో (సరైన వాళ్ళు) దొరకకపోవడం, తనకు నచ్చినట్లుగా తనని వుండనీయక లోకం ఆంక్షలు పెట్టడం.. ఇన్ని విషయాలు ఒకేకథలో చొప్పించే ప్రయత్నం.
పై లిస్టులో ఆఖరి విషయం - సంస్కారవంతులు, "అసామాన్యులు" అనుకున్నవాళ్ళు కూడా స్త్రీ విషయానికి వచ్చేసరికి సామాన్యులకన్నా సంస్కారహీనంగా ప్రవర్తించడం, ఆంక్షలు పెట్టడం అన్న విషయం ఒకటే ఈ కథలో కొత్త విషయం. మిగతాదంతా పాత విషయమే. ఇదే సంపుటిలో మిగతా కథల్లో రిపీటైన విషయమే. ఆ ఒక్క విషయాన్నే పట్టుగా రాస్తే బాగుండేది. అది వదిలేసి భర్తని అనవసరంగా, అవకాశం దొరికినపుడల్లా ఆడిపోసుకోవడం అసంబద్ధంగా వుంది.

కథానాయిక భావాలని భర్త అర్ధం చేసుకోడు. మరో సాహితీ మిత్రుడితో కలిసి ఆమె ఎంతో ఆశతో ఏదో సాహితీ సమావేశానికి వెళ్తుంది. అక్కడ సాహితీ మిత్రులందరూ (ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా) తనపై పెట్టే ఆంక్షలు ఆమెని ఆశ్చర్య పరుస్తాయి.

సరే అక్కడివరకూ బానే వుంది. ఆతర్వాత ఇంటికి తిరిగివస్తుంది. అక్కడ ఈ క్రింది వాక్యాలు…
“అదే కాంపౌండు.. అవే గులాబీలు.. అదే యిల్లు..
ఎక్కడో ఏదో మార్పు. నీకాళ్ళు వణుకుతున్నాయి.”

ఇంట్లో ఏ మార్పూ లేదు కదా! భర్త అలాగే వున్నాడు. మరి ఈ వాక్యాలకర్ధం ఏమిటి?
బయటి పరిస్థితి ఇంటికన్నా ఘోరం అని తెలిసినపుడు.. ఒకవేళ అనిపిస్తే ఇల్లు ఇదివరకటి కంటే బాగా అనిపించాలి. లేదా ఇదివరకటిలాగానే అనిపించాలి. అంతేకానీ కొత్తగా కాళ్ళు వణకడమెందుకు?
పైగా ఆ తర్వాత పేరాలో..
"రెండు రోజులేనని చెప్పి నాలుగు రోజులకొచ్చినందుకు ఏదో జరిగిపోయినట్లు దెప్పిపొడూస్తున్నాడు నీ భర్త. ఒక్కసారి.. ఒకరోజు రాత్రి అతడితో కాకుండా .. మరెక్కడయినా వుండిపోవాల్సి వస్తే .. మరెక్కడయినా పడుకున్నట్లయితే యిక శీలం పోయినట్లేనా!? ..." అన్న వాక్యాలు….
ఎంత అఘాయిత్యంగా వుంది యిది!
రెండు రోజులకి బదులు నాలుగు రోజులకి వస్తే భర్తలు (చాలాసార్లు భార్యలు కూడా) దెప్పిపొడవడం వేరు. శీలం పోయిందన్న అనుమానంతో సాధించడం వేరు.
రెండురోజులని చెప్పి నాలుగురోజులకొస్తావా అని భర్త ఆడిగితే .. "నేనొక్క రోజు బయట పడుకుంటే శీలం పోయినట్లేనా!" అని బాధపడడం ఆ భర్తకి లేనిపోని అనుమానాలు కల్పించడం కాదూ! ఎంత తెలివితక్కువ భార్య అయినా ఇలా బోడిగుండుకీ మోకాలికీ లంకె వేసి బాధపడుతుదా!

మరో కథ ప్రాణశంఖం లోనూ ఇదే ధోరణి. భావుకురాలయిన భార్యకి ప్రాక్టికల్ భర్త వల్ల కలిగే ఆశాభంగం.. బాధా.. ఇదీ కథ ఇతివృత్తం.
దానిలో స్త్రీవాదాన్ని చొప్పించే ప్రయత్నం చేయకుండా ఆ ఇతివృత్తాన్ని అందంగా రాసివుండచ్చు.
ఎందుకంటే అది చాలా సున్నితమయిన విషయం. కథానాయిక భావుకత అరుదయిన విషయం. అది ఆమె అన్నకు అర్ధంవుతుంది. భర్తకి అర్ధం కాదు. స్త్రీ అయినా వదినకి అర్ధం కాదు. అలాంటి జీవితమే గడిపిన ఆమె తల్లికి అది ఒక సమస్యే కాదు.
అంటే ఇక్కడ సమస్య స్త్రీయా పురుషుడా అన్నదికాదు.. మరి అలాంటపుడు..
"తండ్రి లేడుగానీ ..వుండి వుంటే.. ఏంటమ్మా!.. అతడితో సహకరింఛాల్సింది పోయి లా పాయింట్లు తీస్తే ఎట్లమ్మా.. అని సలహాలిచ్చివుండేవాడే. ఎందుకంటే అతనూ మగవాడే" అని హీరోయిన్ అనుకోవడం చిరాకు తెప్పిస్తుంది.
ఇక మార్తా లాంటి కథ ఇంత సీనియర్ రచయిత్రి రాసిందంటే నమ్మేట్లు లేదు. అంటరానిపిల్లని కోడలు ఇంట్లో తెచ్చి పెట్టుకుందని సాధిస్తున్న అత్తగారు కథ చివర్లో టక్కున మారిపోతుంది. ఎందుకో!
పాత్రలకు సరిపడని భాషలూ, భావాలూ ఈ సంపుటిలో చాలా చోట్ల కనిపిస్తాయి.
చదువుకున్న వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు పనిచేసి వచ్చిన పనిపిల్ల చంద్రిక ఆలోచనలు ఇలా వుంటాయి.
"..తరతరాలుగా వస్తోన్న పద్ధతులని మార్చుకోవడానికి అమ్మా, నాయినా యిష్టపడరు. తను చెప్పినా వినరు. ఇక్కడ వీళ్ళంతా కేవల శరీరాల కోసం, శరీరాలతో బ్రతుకుతున్నారు. వీళ్ళందరి నుండీ వేరుగా తనకొక ఆలోచన వుంది. ఎలా జీవించాలో తెలుస్తోంది. అదొక్కటే వీళ్ళకీ తనకీ తేడా.."
ఎంత గంభీరమయిన ఆలోచనలు!

మరో కథలో బస్ కోసం వెయిట్ చేస్తూన్న హీరోయిన్ గురించి చెప్తూ "ఎన్నో కాంతిసంవత్సరాలు గడిచిపోయాక మరో బస్ వచ్చింది" అన్న వాక్యం.
బస్ కోసం వెయిట్ చేసే "టైం" కాంతి సంవత్సరాలట!!

ఇంకా కథల్లో పాత్రలు మాట్లాడుతూన్నపుడు…. ఒక పాత్ర మాట్లాడే మాటల్లోనుంచి మనకి ఒక విషయం అర్ధం అవుతుంటే కథలోని మరో పాత్రకి మాత్రం ఇంకేమిటో అర్ధం అవుతూ వుంటుంది.
ఉదాహరణకి ‘విధ్వంసానికి ఆవలివైపు’ కథలో జయరాముడు అనే పాలేరు తన తండ్రితో "..నిజం చెప్పు.. అమ్మ చచ్చిపోయింది ఆ కిస్టారెడ్డి వల్ల గాదా! దాన్ని నేను మర్చిపోగల్తానా!" అంటాడు.
అది చదివితే మనకి కిస్టారెడ్డి అనే వాడు జయరాముడి తల్లి మీద అత్యాచారమో, అత్యాచార ప్రయత్నమో చేశాడని అర్ధమవుతుంది. కానీ ఆ మాటలు వింటున్న మరో పాత్రకి మాత్రం జయరాముడు కూడా కిస్టా రెడ్డి కొడుకే అన్న విషయం అర్ధమయి, అది జ్వాలయి మెదడుని మండిస్తుంది!!
ఇవీ ఈ పుస్తకం లోని కథల పట్ల నాకు కలిగిన అభిప్రాయాలు.

Wednesday, March 11, 2009

బేబీ హాల్ దార్ - చీకటి వెలుగులు

ఇది బేబీ అనే అమ్మాయి కథ.
చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయిన తల్లి, పిల్లల పట్ల శ్రద్ధ లేని తండ్రీ, పన్నెండేళ్ళకి పెళ్ళవడం, పద్నాలుగేళ్ళపుడు తల్లవడం, బాధ్యతలేని భర్త, భర్తని వదిలి ముగ్గురు పిల్లలతో తానే స్వతంత్రంగా బ్రతకాలని నిర్ణయించుకోవడం, ఎవరి తోడ్పాటూ లేకున్నా, తనకున్నది ఆరోక్లాసు చదువే అయినా ధైర్యంగా నిలబడడం.. ఇలా తన కథంతా తానే బేబీ బెంగాలీలో రాస్తే, దాన్ని ప్రబోధ్ కుమార్ గారు హిందీ లోకీ, శాంతసుందరి గారు తెలుగులోకీ అనువదించారు.
ఈ పుస్తకంగురించి ముందే వినివుండడంతో కొంత ఎక్కువ ఎక్స్ పెక్టేషన్ తో చదవడం మొదలుపెట్టినందుకేమో నాకంత గొప్పగా ఏమీ అనిపించలేదు.
కానీ అటువంటి పరిస్థితులలో వున్న ఒక అమ్మాయి తన కథ తానే చెప్తూండగా తెలుసుకోవడం ఒక వదులుకోలేని అనుభవమే.
అందుకోసం ఈ పుస్తకం చదవచ్చు. శాంతసుందరి గారి అనువాదం బాగుంది.
సామాజిక సంబంధాల గురించీ, నియమాల గురించీ, మనిషి వ్యక్తిత్వం గురించీ చాలా పుస్తకాలు చదివినపుడు వచ్చినట్లే ఈ పుస్తకం చదివినపుడూ నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. పుస్తకం చదివాక వాటి గురించి ఓ రెందురోజులపాటు ఆలోచన జరిగింది.

Saturday, February 28, 2009

కేశవరెడ్డి మునెమ్మ

మొదటి టపా నాకు నచ్చిన ఒక మంచి నవలతో మొదలెట్టాలనుకున్నాను కానీ ....

మునెమ్మ నవల గురించి సమీక్షలూ, విమర్శలూ, చర్చా చదివాక ఆసక్తితో ఆ నవల తెప్పించుకు చదివాను.
కాత్యాయని గారు రాసినట్లు “రాసే వాళ్ళకి చదివేవాళ్ళు లోకువ” అని మొదటి పేజీలు కొన్ని చదవగానే అనిపించింది.
రచయిత పాఠకుల్ని ఎంత ఫూల్స్ గా భావించాడా అనుకుంటే బాధ కలిగింది.
అందుకే ఈ టపా..
****

మునెమ్మ నవల అంతా లెక్కలేనన్ని వైరుధ్యాలు.
బరువు బాధ్యతలు తెలీకుండా తండ్రి అవలక్షణాలన్నీ అంది పుచ్చుకుని తండ్రి మిగిల్చిన 8 గుంటల నేలని కూడా పోగొట్టుకున్న జైరాముడంటే ఎవరికీ విలువలేదని ఓప్రక్క చెపుతారు.
మరోప్రక్క ఆ జైరాముడు, మునెమ్మా వెళ్తుంటే ఊరంతా వాళ్ళని సీతారాములంటారని చెపుతారు.

“మద్దిపాళెం వంటి చోట్ల పరస ప్రారంభం కాగానే తరుగులోడు అక్కడ వాల్తాడు. పరస జరిగినన్నాళ్ళు అక్కడే మకాం వేస్తాడు” అని వాడిని పరిచయం చేస్తారు.
కానీ ఆ పరిచయంలోనే ఆ వాక్యం అబద్ధమని మనకి తెలుస్తూ ఉంటుంది. తరుగులోడు జైరాముడు అడిగితే పరసకి వెళ్ళి పరస జరుగుతూ వుండగానే మళ్ళీ వెనక్కి వస్తాడు. హత్య చేశాడు కాబట్టి కాదు, వాడిపద్ధతే అదన్నట్లుగా వుంటుంది. నవల్లో.

****

"పిలగా" అనేది మునెమ్మ భావావేశంలో జైరాముడ్ని పిలిచే పిలుపని చినబ్బకెలా తెలిసిందో ఎవరు చెప్పారో మనకి తెలీదు. (రచయిత మనకి చెప్పలేదు). జైరాముడు చచ్చిపోయాడు కాబట్టి మునెమ్మే చెప్పుండాలి. తాను భావావేశంలో భర్తని ఏమని పిలుస్తుందో భర్త చనిపోయాక మునెమ్మ చినబ్బకెందుకు చెప్పిందో చినబ్బకే తెలియాలి.

అసలు ఆ రాత్రి చినబ్బ అత్తాకోడళ్ళకి కొత్తగా తోడు పడుకోవాల్సిన అవసరమేమొచ్చిందో అర్ధం కాదు. అంతకు ముందు రెండ్రోజులనుంచీ ఆ ఆడవాళ్ళిద్దరూ వంటరిగా పడుకుంటున్నారు.
ఆరోజు కొత్తగా ఆ యింట్లో ఆ ఆడవాళ్ళకొచ్చిన ప్రమాదమేమీ లేదు. ఓదార్పు కోసమయితే.. చినబ్బకి సాయమ్మనీ మునమ్మనీ ఓదార్చగల స్థాయి లేదు.
మునెమ్మకి ఓ కల వస్తుంది.. ఆ కలవచ్చిన సంఘటన చినబ్బ చూడాలి .. కాబట్టి ఆరోజు చినబ్బ తోడు పడుకున్నాడు అని అనుకోవడానికి కేశవరెడ్డిగారు ఇపుడే కథలు రాయడం మొదలుపెట్టిన చిన్నా చితకా రచయిత కాదు గదా!
***

ఇకపోతే మునెమ్మ ఒంటరిగా జైరాముడి హంతకులని వెతకడానికి వెళ్ళడం హాస్యాస్పదంగానే తప్ప ఉద్వేగంగా ఏమీ లేదు.
సాహసం వుద్వేగాన్నిస్తుంది. అవసరం లేని దుస్సాహసం చిరాకు తెప్పిస్తుంది. ఒక్కోసారి దుస్సాహసం కూడా ఉద్వేగాన్ని తెప్పించచ్చు. ఉదాహరణకి విజయశాంతి సినిమాలు మొదట్లో అలాంటి ఉద్వేగాన్ని కలిగించేవి. కానీ తర్వాత బోరు కొట్టాయి. అంతకంటే తెలివిమాలిన మునెమ్మ ముందుమాట రాసిన జయప్రభ గారికి సూక్ష్మగ్రాహిగా కనిపించడం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.
రోజులు గడిచేకొద్దీ సాక్ష్యాలు మాయమవుతాయనీ, పోలీస్ కంప్లయింట్ ఇవ్వమనీ పెద్దలు చెప్పిన సలహాని పెడచెవిని పెట్టి, మేమెళ్ళి కనుక్కుని వస్తామన్న (చినబ్బ తండ్రి ఆ మాట అంటాడు) పెద్దవాళ్ళ మాటని గాలికొదిలేసి ఓ లొట్టిగాడిని వెంటేసుకుని బయల్దేరడం సూక్ష్మగ్రాహి లక్షణమా!
పైగా మునెమ్మవి ఈనాటి స్త్రీల ఆలోచనలూ, వాళ్ళు వేసే అడుగులూనట.(జయప్రభగారు చెప్పిన మాట).
గిత్తలతో రంకు కట్టి చెంప పగలగొట్టే మొగుడ్ని చంపిన హంతకుల్ని తమ చేతులతో తామే చంపేందుకు బయల్దేరతారా ఈనాటి ఆడవాళ్ళు! హతవిధీ !

అనుభవజ్ఞురాలు సాయమ్మ మునెమ్మ ఓంటరిగా వెళ్ళడం గురించి సందేహ పడితే, మునెమ్మ "భూమ్మీదకి వచ్చేముందు మనం ఎలా బ్రతుకుతామో ఆలోచించే వచ్చామా!" అంటుంది.
ఇలాంటి వాక్యాలు చదివినపుడల్లా (చాలా దొరుకుతాయి మనకీ నవల్లో) రాసేవాళ్ళకి చదివేవాళ్ళు లోకువ అని మళ్ళీ మళ్ళీ అనిపించింది.

***

భర్తని చంపిన హంతకుల్ని వెతుక్కుంటూ బయల్దేరిన మునెమ్మ మద్దిపాళెం (భర్త చనిపోయిన వూరు) చేరగానే… "ఊరు కనబడగానే నా వళ్ళంతా పులకరించిపోయిందిరా!.. " అంటూ ఓ పేరా డైలాగులు చెప్తుంది. మూర్ఖుడైన భర్తల్ని ప్రేమించే భార్యలు లేరని కాదు. కానీ ఈ వాక్యాలు మాత్రం అసలేమాత్రమూ మింగుడుపడవు.
"ఆయన నాకు కలలో సూటిగా సందేశమిచ్చాడు" అంటుంది మునెమ్మ భర్తని గురించి.
ఆపాత్రకి సరిపడని భావం. భాష.

***


ఇక ఎక్కువగా చర్చించబడిన బొల్లిగిత్త విషయం.
అది మునెమ్మమీదికి వంగడం సహజమో కాదో నాకు తెలీదు. పశువుల గురించీ, పల్లెల గురించీ నాకెక్కువ తెలీదు.
సహజం కాదని వచ్చిన విమర్శలూ, దానికి రచయిత కేశవరెడ్డిగారి సమాధానమూ చదివాక నేను నవల చదివాను.
అయితే నవలలోని వైరుధ్యాలలోనే నాకు సమాధానం దొరికిందనిపించింది.
బొల్లిగిత్త చేసింది సహజచర్య అయితే సూక్ష్మగ్రాహి మునెమ్మకి ఆ విషయం తెలీకపోవడమేమిటి? (బొల్లిగిత్త మీదపడి రవిక చింపినా, జైరాముడికి కోపమొచ్చి తన చెంప పగలగొట్టి, గొడ్డుని చావగొట్టినా ..ఇదంతా మళ్ళి అత్తకి తాను వివరించి చెప్తూన్నపుడు కూడా మునెమ్మకి విషయం అర్ధం కాదు. ఆతర్వాత కూడా (నవలంతా అయిపోయేవరకూ కూడా) మునెమ్మకి అర్ధమయినట్లు కనిపించదు.) ఇది గిత్తలు సహజంగా చేసే పని అయితే పల్లెపడుచు మునెమ్మకి ఊహకి కూడా తట్టలేదెందుకు!
మునెమ్మదాకా ఎందుకు! ఎంత మూర్ఖుడైన జైరాముడయినా గిత్తల సహజప్రవర్తనకి గిత్తని అమ్మేద్దామనుకుంటాడా! అది సహజప్రవర్తన అయితే కొత్త ఎద్దూ అదే పని చేస్తుంది కదా! ముద్దలు కలుపుకుని సుతారంగా తినకుండా పళ్ళెం నాకుతోందని తనకిష్టమయిన కుక్కని చావగొట్టి అమ్మేస్తాడా జైరాముడు!

_____________